కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం అర్ధరాత్రి పెను ప్రమాదం తృటిలో తప్పింది. మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి వరి లోడుతో బయలుదేరిన లారీ, పనగట్టి చౌరస్తా వద్ద మూలమలుపు తిరుగుతున్న సమయంలో అదుపుతప్పి బుర్ర శ్రీనివాస్ ఇంటి పైకి దూసుకెళ్లింది.
ఈ ఘటన గురువారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. లారీ అతివేగంగా రావడంతో ఇంటి గోడలు దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికి ప్రాణనష్టం జరగలేదు. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి ప్రధాన కారణం రోడ్డు ఇరుకుగా ఉండటమేనని స్థానికులు పేర్కొన్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని గ్రామస్థులు, ప్రయాణికులు కోరుతున్నారు.








