కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై రైతులు ఆందోళనకు దిగారు. గన్నేరువరం మండలం ఖాసీంపేట గ్రామంలోని ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ముందు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
రైతులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు 14 లారీలు, 7 డీసీఎం వాహనాల్లో మాత్రమే ధాన్యం తరలించారని, ఇంకా ఎనిమిది లారీల ధాన్యం కొనుగోలు కోసం ఎదురుచూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 5,500 క్వింటాళ్ల ధాన్యం తరలించినప్పటికీ, 600 క్వింటాళ్లు తూకం వేసి నిల్వ ఉంచారని, ఇంకా 3 వేల క్వింటాళ్ల ధాన్యం కాంట వేయాల్సి ఉందన్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులతో సరైన సమీక్ష నిర్వహించకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతోందన్నారు. రోహిణి కార్తె ప్రారంభమై వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఇప్పటికీ సగం ధాన్యం కూడా కొనుగోలు కాలేదని, రైతుల పంట వర్షార్పణమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో అధిక తూకం, గన్ని బ్యాగుల కొరత, లారీల సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టిన అధికార పార్టీ నాయకులు, అధికారులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్, గొల్లపల్లి రవి, కొట్టే భూమయ్య, బూర శ్రీనివాస్, సంధవేణి తిరుపతి, మీసాల ప్రభాకర్, జిల తిరుపతి, మునగంటి సంతోష్, బండి తిరుపతి, బద్దం వెంకటరెడ్డి, బొజ్జ అనిల్, మునగంటి శేఖర్, గుర్రం రమణారెడ్డి, సాయిని తిరుపతి, పాలేపు అనిల్, బొజ్జ మహి, బొజ్జ పార్శారం తదితరులు, రైతులు పాల్గొన్నారు.








