అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వచ్ఛ సర్వేక్షన్ – స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర” కార్యక్రమాలను విజయవంతం చేయాలని గుత్తి మున్సిపల్ కమిషనర్ బి. జబ్బర్ మియా పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో, మే 23, 2026 నుండి జూన్ 19, 2026 వరకు నాలుగు వారాల పాటు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్ర పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పట్టణాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
కార్యక్రమం దశలవారీగా నిర్వహించబడుతుందని ఆయన వివరించారు. మే 23 నుండి మే 29 వరకు రోడ్లు మరియు బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మే 30 నుండి జూన్ 5 వరకు మధ్యస్థ మరియు పెద్ద కాలువల శుభ్రత పనులు చేపడతామని పేర్కొన్నారు. జూన్ 6 నుండి జూన్ 12 వరకు గృహాలు, వ్యాపార సంస్థల నుండి పూర్తి స్థాయిలో చెత్త సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. చివరిగా జూన్ 13 నుండి జూన్ 19 వరకు చెత్త నిల్వ ప్రాంతాల నుండి పూర్తిస్థాయిలో చెత్త తొలగింపు కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పట్టణంలోని ఎన్జీవోలు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు మరియు పట్టణ ప్రజలు అందరూ చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ జబ్బర్ మియా విజ్ఞప్తి చేశారు.








