అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్‌పై “కొత్త దాడులు” చేపట్టేందుకు అమెరికా సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. పరిస్థితులు మరింత విషమించడంతో ముందుజాగ్రత్త చర్యగా తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలు నిలిచిపోవడంతో అంతర్జాతీయ వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, రాబోయే 24 గంటల్లో దౌత్యపరంగా కీలక పురోగతి లేకపోతే ఇరాన్‌పై భారీ సైనిక చర్యలకు ఆమోదం తెలిపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే దాడులపై తుది నిర్ణయం మాత్రం ఇంకా తీసుకోలేదని ఆ కథనం స్పష్టం చేసింది.
ఈ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అమెరికా పరిపాలనా వ్యవస్థపై కూడా కనిపిస్తోంది. అమెరికా సైనిక, నిఘా విభాగాలకు చెందిన పలువురు అధికారులు తమ మెమోరియల్ డే వారాంతపు ప్రణాళికలను రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇదే సమయంలో, పరిస్థితులు వేగంగా మారుతుండటంతో ట్రంప్ కూడా న్యూజెర్సీ పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని హుటాహుటిన వాషింగ్టన్కు చేరుకున్నారు.
సంక్షోభ తీవ్రతను తెలియజేస్తూ, తన కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ వివాహానికి కూడా తాను హాజరుకాలేనని ట్రంప్ ప్రకటించారు. “ప్రభుత్వానికి సంబంధించిన పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం వాషింగ్టన్లోనే ఉండటం అవసరం” అని ఆయన తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం పరిస్థితిని ఎంత గంభీరంగా తీసుకుంటోందో స్పష్టమవుతోంది.
గత ఏప్రిల్‌లో ట్రంప్ ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటివరకు అమల్లో ఉన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య చర్చలు మాత్రం ముందుకు సాగడం లేదు. ముఖ్యంగా ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభన సమస్యను మరింత క్లిష్టంగా మార్చింది.
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు అమెరికా అవకాశం ఇవ్వబోదని స్పష్టం చేస్తోంది. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను దేశం వెలుపలికి తరలించాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తుండగా, తమ అణు కార్యక్రమం స్వతంత్ర హక్కు అని చెబుతున్న ఇరాన్ మాత్రం ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది.
ఈ పరిణామాల మధ్య పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.








