కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నివసిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల వివరాల నమోదు ప్రక్రియను కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రారంభించినట్లు కొత్తపల్లి ఇన్స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్ తెలిపారు.
పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి వచ్చి స్థానికంగా నివసిస్తున్న వలస కార్మికుల వ్యక్తిగత వివరాలు, నివాస చిరునామాలు, ఉపాధి సంబంధిత సమాచారాన్ని సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా కొత్తపల్లి స్టేషన్ హౌస్ అధికారి, ట్రైనీ ఐపీఎస్ సోహం సునిల్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం ఈ నమోదు ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని వలస కార్మికులకు అవగాహన కల్పిస్తూ వారి వివరాలను నమోదు చేశారు.








