మెదక్ జిల్లా – చిన్నశంకరంపేట : గ్రామాలు అన్ని విధాలుగా ఆదర్శవంతంగా ఉండేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు సమిష్టిగా కృషి చేయాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ అన్నారు. గురువారం మండలంలోని రుద్రారం గ్రామంలో 99వ ప్రణాళిక గ్రామసభను సర్పంచ్ ఆకుల సంతోషి నవీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ గ్రామసభకు ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ నాగేష్ మాట్లాడారు.
గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన పెరిగినప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ మాట్లాడుతూ రైతులు అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. రైతులకు డిజిటల్ మాధ్యమాల ద్వారా ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా గవలపల్లి తండాలో సర్పంచ్ బానావత్ అనసూయ, జంగరాయి గ్రామంలో సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి, మిర్జాపల్లి తండాలో సర్పంచ్ మూడవ కిషన్, ప్యాటగడ్డలో సర్పంచ్ రాతుల లావణ్య, రామాయపల్లిలో సర్పంచ్ బాగోన్నల రేణుక, టీ. మాందాపూర్‌లో సర్పంచ్ మూడవ అశోక్ నాయక్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు.
ఈ గ్రామసభల్లో సురక్షిత సాగునీరు, జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకం, వనమహోత్సవం, సమగ్ర కుటుంబ సర్వే, గ్రామ రహదారుల పరిశుభ్రత తదితర ఏడు ముఖ్యాంశాలపై చర్చించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మాలతి, ఎంపీడీవో దామోదర్, ఏఎస్ఓ ఇలియాస్, రాములు, వసుదేవ్, జీసస్, వినోద్ కుమార్, లోకేష్ తదితర అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.








