contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బరితెగించిన భూ మాఫియా .. రూ.200 కోట్ల మున్సిపల్ రోడ్డు కబ్జా

కాకినాడ : కాకినాడ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని మున్సిపల్ ఆస్తి అయిన ముసాఫర్ వీధి రహదారిపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పేరుతో భవన నిర్మాణాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రహదారిని పునరుద్ధరించాలని, లేకపోతే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేస్తామని హెచ్చరించారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజారామ్మోహన్ రాయ్ రోడ్డులో జిల్లా కలెక్టరేట్‌కు ఆనుకుని ఉన్న పూర్వ ట్రావెలర్స్ బంగ్లా సమీపంలోని మున్సిపల్ రహదారి అయిన ముసాఫర్ వీధిని పూర్తిగా ఆక్రమించి, రెండు వైపులా ప్రహరీ గోడలు నిర్మించి భవనాల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం తీవ్ర అభ్యంతరకరమన్నారు.

1998లో ఆక్రమణల నుంచి విముక్తి

1998లో అప్పటి ఆర్డీవో రేఖారాణి, ఉమ్మడి జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర హయాంలో ఆక్రమణల నుంచి ముసాఫర్ వీధిని విముక్తి చేసి మున్సిపాలిటీకి అప్పగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో కలపాలనే ప్రయత్నం జరిగినప్పటికీ, మున్సిపల్ చట్టం, మాస్టర్ ప్లాన్ నిబంధనల ప్రకారం ప్రధాన రహదారిని ఏ ప్రభుత్వ శాఖ కూడా స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని తెలిపారు.

ప్రస్తుతం ప్రైవేట్ కేసు పెండింగ్‌లో ఉందనే కారణంతో రహదారిని అభివృద్ధి చేయకుండా వదిలేయడం వల్ల మళ్లీ ఆక్రమణలకు అవకాశం కలిగిందని ఆయన ఆరోపించారు.

మాస్టర్ ప్లాన్‌లో ఇప్పటికీ రహదారిగానే నమోదు

ముసాఫర్ వీధి ప్రభుత్వం గెజెట్, మున్సిపల్ రికార్డులు, పూర్వ, ప్రస్తుత, భవిష్యత్ మాస్టర్ ప్లాన్‌లలో ఇప్పటికీ రహదారిగానే నమోదై ఉందని రమణరాజు తెలిపారు. అలాంటి రహదారిపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.

సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ స్థలం విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం ధర సుమారు రూ.1.50 లక్షలు పలుకుతోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలకు అవసరమైతే నగరంలోని ఇతర ప్రభుత్వ స్థలాలను కేటాయించవచ్చని, ప్రజల కోసం ఉద్దేశించిన ప్రధాన రహదారిని మూసివేసి నిర్మాణాలు చేపట్టడం సమంజసం కాదన్నారు.

ట్రాఫిక్ సమస్యలు మరింత పెరుగుతాయి

రాజారామ్మోహన్ రాయ్ రోడ్డులో ఇప్పటికే ట్రాఫిక్ తీవ్రంగా పెరిగిన నేపథ్యంలో ముసాఫర్ వీధి క్రాస్ రోడ్డును పునరుద్ధరించడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ రహదారిని ఆక్రమించే హక్కు మున్సిపాలిటీకి కూడా లేదని, అలాంటి రహదారిపై నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం ప్రజాహక్కులను కాలరాయడమేనని విమర్శించారు.

హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ప్రజా రహదారులను ఇతర అవసరాలకు వినియోగించలేమని, గతంలో ఎవరు అనుమతులు ఇచ్చినా చట్టం ముందు అవి చెల్లవని స్పష్టం చేశారు.

ముసాఫర్ వీధిని తక్షణమే ఆక్రమణల నుంచి విముక్తి చేసి రహదారిగా పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి న్యాయపోరాటం కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :