మెదక్, జూన్ 5 (రిపోర్టర్ టీవీ): రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యం కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని, అలాగే జనగణన కార్యక్రమాన్ని అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, జనగణన సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో ధాన్యం నిల్వలు, తూకం ప్రక్రియ, రవాణా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు పూర్తయిన కేంద్రాల్లోని సిబ్బంది, వాహనాలు, హమాలీలను ధాన్యం నిల్వలు అధికంగా ఉన్న ఇతర కొనుగోలు కేంద్రాలకు తరలించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. రైతులు తమ పంటను విక్రయించేందుకు ఎక్కువ రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిల్లులకు తరలించిన ధాన్యాన్ని అన్లోడ్ చేసే ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం జనగణన సర్వే నిర్వహణను పరిశీలించిన కలెక్టర్ ప్రతిమా సింగ్, జనగణన దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ప్రజల వివరాలను క్షుణ్ణంగా సేకరించి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆన్లైన్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో, సక్రమంగా నమోదు కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జనగణనలో ఖచ్చితత్వం పాటించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు అవసరమైన గణాంకాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డీఎంసీఎస్, డీఎస్ఓ, ఆర్డీఓ, తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








