చౌడేపల్లి, జూన్ 5 : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల సముదాయం ఆవరణలో అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓలు గఫూర్, మస్తాన్, డిప్యూటీ తహసీల్దార్ దొరస్వామి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు అనిల్ కుమార్, ఇందిరారాణి, బీట్ ఆఫీసర్లు పాల్గొని వివిధ రకాల మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించాలంటే మొక్కల పెంపకం అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని సూచించారు.
అనంతరం ప్రజలకు మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు కొంతమందికి సీడ్ బాల్స్ పంపిణీ చేసి వాటిని ఖాళీ ప్రదేశాల్లో చల్లాలని కోరారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని అధికారులు వివరించారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.









