contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వరుస ఆలయ చోరీల కేసులు ఛేదించిన పోలీసులు

మెట్‌పల్లి, జూన్ 5: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల ఆలయాల్లో ఇటీవల చోటుచేసుకున్న వరుస చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఎనిమిది ఆలయ చోరీలకు పాల్పడిన భార్యాభర్తలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి దొంగిలించిన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెట్‌పల్లి డీఎస్పీ రాములు పర్యవేక్షణలో, మెట్‌పల్లి సీఐ బి. సురేష్‌బాబు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్, మల్లాపూర్ ఎస్సై అనిల్, ఇబ్రహీంపట్నం ఎస్సై జి. నవీన్‌కుమార్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు విశాల్, కిరణ్, ప్రణయ్‌లతో కూడిన బృందం సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల జాడను గుర్తించింది.

దర్యాప్తులో వెల్లుల్ల గ్రామానికి చెందిన ఆరే శంకర్, అతని భార్య ఆరే అనూషతో పాటు మరికొందరు కలిసి పలు ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని బండలింగాపూర్, వర్షకొండ, తిమ్మాపూర్, వేములకుర్తి గ్రామాల ఆలయాలు, మెట్‌పల్లి మండలం ఆత్మకూరు, వేంపేట, మల్లాపూర్ మండలంలోని సిర్పూర్, రాఘవపేట, కథలాపూర్ మండలంలోని ఊట్పల్లి గ్రామాల దేవాలయాల్లో జరిగిన చోరీలతో సహా మొత్తం ఎనిమిది కేసుల్లో నిందితుల ప్రమేయం ఉన్నట్లు తేలింది.

గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, ఎనిమిది చోరీల కేసులకు సంబంధించిన నేరాలను ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 20 గ్రాముల బంగారం, 1.250 కిలోల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అనంతరం నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా, కోర్టు వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసులను త్వరితగతిన ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. గ్రామాల్లోని ఆలయాల వద్ద భద్రతా చర్యలను మరింత పటిష్ఠం చేయాలని పోలీసు అధికారులు సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :