చేగుంట/తూప్రాన్ : రాష్ట్రస్థాయి అండర్-18 రగ్బీ పోటీలలో మెదక్ జిల్లా బాలికల జట్టు విశేష ప్రతిభ కనబర్చి మూడో స్థానాన్ని కైవసం చేసుకుని కాంస్య పతకాన్ని సాధించింది.
ఈ నెల 5, 6 తేదీల్లో భుదేరా మండల కేంద్రంలోని ఆక్సిజన్ యూనివర్సిటీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్-18 బాలబాలికల రగ్బీ పోటీలలో తెలంగాణలోని 18 జిల్లాల నుంచి క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మెదక్ జిల్లా బాలికల జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు.
మెదక్ జిల్లా జట్టులో నవ్యశ్రీ, రోజా, అంజలి, సోనా, అఖిల, షారిభా, గాయత్రి, దివ్య, వర్షశ్రీ, ఎస్తేర్ రాణి, సుప్రియ, వందన సభ్యులుగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
రాష్ట్రస్థాయిలో మెదక్ జిల్లా బాలికలు కాంస్య పతకం సాధించడం పట్ల మెదక్ జిల్లా రగ్బీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరి, పీడీలు శారద, రంగీలా, జయశీలతో పాటు పలువురు క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. క్రీడాకారిణులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.








