గుంతకల్లు : ఆపదలో ఉన్న ఓ కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్. గుత్తి మండలం ఉబిచర్ల గ్రామానికి చెందిన ఎర్రజొన్న రామకృష్ణ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర శస్త్రచికిత్స కోసం భారీ మొత్తంలో డబ్బులు అవసరమవడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్‌ను ఆశ్రయించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి తన క్యాంపు కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) కోసం దరఖాస్తును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఎమ్మెల్యే చొరవతో రామకృష్ణ శస్త్రచికిత్స కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేయించడంలో కీలక పాత్ర పోషించారు.
సకాలంలో స్పందించి తమ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్, గుత్తి–పామిడి ఇన్‌చార్జి గుమ్మనూరు ఈశ్వరన్నలకు రామకృష్ణ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపద సమయంలో తమకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి సహాయం అందించినందుకు జీవితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ అవసరమైన వారికి సహాయం అందించడంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ ముందుంటున్నారని స్థానికులు అభినందిస్తున్నారు.









