గుత్తి, : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీ రక్ష యాప్ గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని గుత్తి ఎస్సై సురేష్ సూచించారు.
అనంతపురం జిల్లా గుత్తి మండలం లచ్చానాపల్లె గ్రామంలో మంగళవారం అర్బన్ సీఐ రామారావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు సైబర్ నేరాలు, రోడ్డు భద్రత, మహిళా మరియు బాలల రక్షణ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ, సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు. అలాగే రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ ఉపయోగించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు.
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, పిల్లలపై జరిగే లైంగిక వేధింపులను నిరోధించేందుకు అమల్లో ఉన్న పోక్సో చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్, అసాంఘిక కార్యకలాపాలు మరియు ఇతర నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100, 112, 1098 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్సై సురేష్ హామీ ఇచ్చారు. ప్రజల భద్రత కోసం పోలీసు శాఖ చేపడుతున్న కార్యక్రమాలకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.








