మాసాయిపేట/తూప్రాన్ : రోడ్డు ప్రమాదాల నివారణలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కీలక పాత్ర పోషించాలని అదనపు డీజీపీ సంజయ్ కుమార్ (టీజీఎస్పీ బెటాలియన్స్) పేర్కొన్నారు. ప్రజా పాలనా – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెదక్ జిల్లా మాసాయిపేట గ్రామంలో నిర్వహించిన గ్రామసభ సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు డీజీపీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులకు చిన్ననాటి నుంచే ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. పాఠశాల స్థాయిలోనే రోడ్డు భద్రతపై సరైన అవగాహన పెంపొందిస్తే భవిష్యత్తులో వారు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని చెప్పారు.
అలాగే కుటుంబ సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు హెల్మెట్ ధరించడం, సీటు బెల్ట్ పెట్టుకోవడం, అతివేగంగా వాహనాలు నడపకపోవడం వంటి భద్రతా సూచనలు తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తు చేయాలని సూచించారు. కుటుంబ స్థాయిలో అవగాహన పెంపొందితే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నాయని హెచ్చరించారు.
రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. “అరైవ్ అలైవ్” సందేశాన్ని ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోందన్నారు. ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచడం, ట్రాఫిక్ నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా యువత బాధ్యతాయుతంగా వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని సూచించారు.
హెల్మెట్, సీటు బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపరాదని, అతివేగం మరియు నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.
గ్రామసభలో పంచాయతీ, మండల పరిధిలోని ప్రజలందరూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించి, ట్రాఫిక్ నియమాల పాటనకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మెదక్ అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, తూప్రాన్ ఆర్డీఓ, డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు వెంకట రాజా గౌడ్, సందీప్ రెడ్డి, సైదా, ఎస్‌ఐలు, గ్రామ సర్పంచ్ కృష్ణారెడ్డి, పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








