పార్వతీపురం మన్యం జిల్లా – కురుపాం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కురుపాంలో సోమవారం ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీకి నాయకత్వం వహించారు.
కార్యక్రమం ప్రారంభంలో గాంధీనగర్ కూడలిలోని స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీనగర్ నుంచి బస్టాండ్ మీదుగా పెట్రోల్ బంకు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం హయాంలో వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా నెరవేర్చుతోందని, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందని తెలిపారు.
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆమె చెప్పారు. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించిన ఆమె, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దెబ్బతిన్నదని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ పరిశీలకుడు ఎం. వెంకటేష్, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, రాష్ట్ర తూర్పు కాపు, కొప్పలవెలమ, ట్రైకర్ బోర్డు డైరెక్టర్లు శేఖర్ పాత్రుడు, మధుసూదనరావు, పువ్వల లావణ్య, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.








