అమెరికాలో హెచ్-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న ఓ భారతీయ టెక్నాలజీ నిపుణుడు తన యజమానిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ టెక్సాస్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. ఉద్యోగం కొనసాగించాలంటే, గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియ ముందుకు సాగాలంటే భారీ మొత్తంలో డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చి, దాదాపు లక్ష డాలర్లు (సుమారు రూ.94 లక్షలు) బలవంతంగా వసూలు చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మిచిగాన్‌లో నివసిస్తున్న రిషికేశ్ రాజ్ మీసాల అనే హెచ్-1బీ వీసాదారుడు, టెక్సాస్‌కు చెందిన ఐటీ సంస్థ “ప్రోగ్రెస్ సొల్యూషన్స్ ఇంక్”తో పాటు ఆ సంస్థ సీఈఓ సాయి జితేందర్ కలగ్రాపై ఈ దావా వేశారు. తనను బలవంతపు శ్రమకు గురిచేశారని, వేతనాల్లో కోతలు విధించారని, ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఫిర్యాదు చేసి దేశం నుంచి పంపిస్తామని బెదిరించారని ఆరోపించారు.
ఫిర్యాదు ప్రకారం, ఉద్యోగంలో చేరిన తొలి రోజు నుంచే క్లయింట్ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నప్పటికీ, తనను జీతం లేకుండా ‘బెంచ్’పై ఉంచినట్లు మీసాల తెలిపారు. అంతేకాకుండా కంపెనీ పే స్లిప్పులు ఇవ్వలేదని, వేతనాలు కూడా నిబంధనలకు అనుగుణంగా చెల్లించలేదని ఆరోపించారు.
ఉద్యోగ భద్రత, గ్రీన్ కార్డ్ ప్రక్రియ కొనసాగింపును కారణంగా చూపుతూ డబ్బులు డిమాండ్ చేశారని, ఫిర్యాదు చేస్తే అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) అధికారులకు అప్పగిస్తామని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. “ఐస్ చూసుకుంటుంది” అంటూ తరచూ హెచ్చరించేవారని దావాలో వెల్లడించారు.
ఈ బెదిరింపుల వల్ల తీవ్ర మానసిక వేదన, ఆందోళనలకు గురైనట్లు మీసాల తెలిపారు. తనకు రావాల్సిన వేతన బకాయిలు, బలవంతంగా వసూలు చేసిన మొత్తం, అదనపు నష్టపరిహారాన్ని చెల్లించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు.
ఈ కేసు హెచ్-1బీ వీసా వ్యవస్థలో ఉన్న సవాళ్లను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా వీసా స్పాన్సర్‌షిప్‌పై ఆధారపడి పనిచేసే విదేశీ ఉద్యోగులు యజమానుల దోపిడీ, బెంచింగ్, వేతనాల కోతలు, బలవంతపు వసూళ్ల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారనే ఆందోళనలు గత కొంతకాలంగా వ్యక్తమవుతున్నాయి.
అయితే ఈ ఆరోపణలపై ఇప్పటివరకు సంస్థ లేదా సీఈఓ సాయి జితేందర్ కలగ్రా అధికారికంగా స్పందించలేదు. ఈ కేసు విచారణ నవంబర్‌లో జరగనుండగా, హెచ్-1బీ వీసాదారుల హక్కులు, కార్మిక రక్షణ నిబంధనల అమలుపై అమెరికాలో మళ్లీ చర్చ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది.









