మాసాయిపేట (మెదక్ జిల్లా) : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయం వద్ద యూరియా ఎరువుల కోసం రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. బొమ్మరం, పోతనపల్లి గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచే రైతు వేదిక వద్దకు చేరుకుని అధికారుల కోసం ఎదురుచూస్తున్నారు.
యూరియా పంపిణీపై సమాచారం కోసం వచ్చిన రైతులకు సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, యూరియా కోసం పలుమార్లు కార్యాలయానికి వచ్చినప్పటికీ అధికారులు సమయానికి రావడం లేదని, తమ సమస్యలను పట్టించుకునే వారు ఎవరూ కనిపించడం లేదని వాపోయారు. వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
యూరియా పంపిణీపై స్పష్టమైన సమాచారం ఇవ్వడంతో పాటు, రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.








