అనకాపల్లి : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని తాటిపర్తి గిరిజన గ్రామంలో నెలకొన్న తీవ్రమైన మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామస్థులు ఖాళీ బిందెలతో వినూత్న ధర్నా నిర్వహించారు. కొత్త రక్షిత మంచినీటి ట్యాంకును నిర్మించి, గ్రామానికి శాశ్వత తాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాటిపర్తి గ్రామంలో 48 గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామానికి 20 సంవత్సరాల క్రితం నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుని ఎప్పుడు కూలిపోతుందోనన్న భయాందోళనలో ప్రజలు జీవిస్తున్నారు. ట్యాంకుకు క్లోరినేషన్ కూడా చేయడం లేదని, విద్యుత్ సరఫరా నిలిచిపోతే గ్రామానికి మంచినీరు అందడం లేదని గ్రామస్థులు వాపోయారు.
గ్రామంలోని నాలుగు చేతి బోర్లు కూడా పాడైపోవడంతో వాటిలో నీరు రావడం లేదని తెలిపారు. దీంతో తాగునీటి కోసం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడి నీటిని తాగడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే 18 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని, గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు ఆటోలను అద్దెకు తీసుకుని రోగులను ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఉందన్నారు.
జల్ జీవన్ మిషన్ పథకం కింద ప్రతి ఇంటికి నీటి పైపులైన్లు వేసినప్పటికీ, కొత్త వాటర్ ట్యాంకు నిర్మించకపోవడంతో పథకం లక్ష్యం నెరవేరలేదని గ్రామస్థులు తెలిపారు. కొత్త ట్యాంకు నిర్మిస్తే గ్రామంలో శాశ్వతంగా మంచినీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
ఈ సమస్యపై ఇప్పటికే జూలై 1న రావికమతం ఎంపీడీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్థులు ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.
ఈ నిరసనలో గ్రామ మహిళలు బొయిన సుజాత, బొయిన గంగమ్మ, సెగ్గి లక్ష్మితో పాటు పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కే. గోవిందరావు మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించే సీఎస్‌ఆర్ (CSR) నిధులను వినియోగించి తాటిపర్తి గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.








