contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఏనుగుల దాడితో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి , పాకాల : ఏనుగుల దాడి కారణంగా పంటలు కోల్పోయిన చంద్రగిరి నియోజకవర్గ రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. పాకాల మండలంలోని వల్లివేడు, కావలివారిపల్లి, రాయవారిపల్లి, పదిబట్లబైలు, గుండ్లగుట్లపల్లి, పుల్లవాండ్లపల్లి తదితర గ్రామాల్లో ఏనుగుల బారినపడి పంటలు దెబ్బతిన్న 44 మంది రైతులకు రూ.6,79,730ల పంట నష్టపరిహారం చెక్కులను సోమవారం పాకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అటవీ శాఖ అధికారులతో కలిసి లబ్ధిదారులకు పరిహారం చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి పరిహార నిధులను మంజూరు చేసిందని తెలిపారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రకృతి వైపరీత్యాలు లేదా అడవి జంతువుల దాడులతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏనుగుల దాడులతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూసినా సరైన చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే విమర్శించారు. ఇకపై నియోజకవర్గంలో ఏ ప్రాంతంలోనైనా ఏనుగుల సంచారం గుర్తించిన వెంటనే అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా స్పందించి, రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పంట నష్టపరిహారం సకాలంలో అందేలా ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే పులివర్తి నానికి లబ్ధిదారులైన రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాకాల మండల తహశీల్దార్, ఎంపీడీఓ, అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు మరియు లబ్ధిదారులైన రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :