contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి జిల్లా, పాకాల : ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు. పాకాల మండల ప్రజా పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షుడు లోకనాథం అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, వివిధ శాఖల పనితీరుపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలపై ఎమ్మెల్యే స్పందిస్తూ క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు కొందరు బెదిరింపులు, ప్రలోభాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే అధికారులు, ప్రజలు అలాంటి చర్యలకు భయపడాల్సిన అవసరం లేదని, కూటమి ప్రభుత్వం వారికి పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రతి ప్రభుత్వ అధికారి మండల సర్వసభ్య సమావేశాలకు తప్పనిసరిగా హాజరై ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలకు సమాధానం ఇవ్వాలని సూచించారు.

రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్న ఆయన, సమావేశంలో వచ్చిన ప్రతి సమస్యను నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించి త్వరితగతిన పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు.

పాకాల మండలంలో కోట్లాది రూపాయల నిధులతో రహదారులు, వంతెనల నిర్మాణం, చారిత్రక దేవాలయాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. అలాగే మామిడి రైతులకు కూటమి ప్రభుత్వంలోనే సరైన భరోసా లభించిందని, బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోందని తెలిపారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు సమన్వయంతో పనిచేస్తే చంద్రగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

సమావేశం ముగింపులో త్వరలో పదవీ కాలం పూర్తికానున్న జడ్పీటీసీలు, ఎంపీపీ, ఎంపీటీసీల సేవలను ఎమ్మెల్యే కొనియాడారు. వారి ప్రజాసేవను గుర్తిస్తూ శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వివిధ శాఖల సిబ్బంది, గ్రామాల ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :