న్యూఢిల్లీ : భారత విమానయాన రంగం మరో అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోని గౌహతి లోక్‌ప్రియ గోపీనాథ్ బొర్దొలొయ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్, డిజైన్ పురస్కారం ‘ప్రిక్స్ వెర్సైల్స్-2026’ ఈ జాబితాను తాజాగా ప్రకటించింది.
పారిస్‌లోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రకటించే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు, ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నిర్మించిన లేదా అత్యాధునికంగా అభివృద్ధి చేసిన విమానాశ్రయాలను గుర్తిస్తూ ప్రదానం చేస్తారు. ఆధునిక నిర్మాణ శైలి, పర్యావరణహిత రూపకల్పన, స్థానిక సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే అంశాలు, ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని కల్పించే సౌకర్యాలను ప్రామాణికాలుగా తీసుకుని ఎంపిక చేపడతారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా కేవలం ఏడు విమానాశ్రయాలకే ఈ అరుదైన గుర్తింపు లభించింది.
గౌహతిలోని టెర్మినల్-2ను ఈశాన్య భారత ప్రత్యేకతను ప్రతిబింబించే ‘వెదురు ఆర్కిడ్’ పుష్పం స్ఫూర్తితో రూపకల్పన చేశారు. టెర్మినల్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండోర్ స్కై ఫారెస్ట్’, అస్సాం సంప్రదాయ హస్తకళలతో కూడిన అలంకరణలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్థానిక సంస్కృతి, ప్రకృతి అందాలను ఆధునిక నిర్మాణ శైలితో మేళవించడం ఈ టెర్మినల్ ప్రత్యేకతగా నిలిచింది.
అదానీ గ్రూప్ అభివృద్ధి చేస్తున్న నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1ను కమలం ఆకృతిలో అత్యాధునికంగా నిర్మించారు. సహజ కాంతి, గాలి ప్రసరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఇంధన వినియోగాన్ని తగ్గించే విధంగా పర్యావరణహిత సాంకేతికతను ఇందులో వినియోగించారు. సుస్థిర అభివృద్ధికి అనుగుణంగా రూపొందించిన ఈ టెర్మినల్ ప్రపంచ స్థాయి డిజైన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
ఈ ఏడాది ప్రకటించిన జాబితాలో భారత్‌తో పాటు చైనాలోని గ్వాంగ్‌జౌ, జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్, అమెరికాలోని పిట్స్‌బర్గ్, శాన్ డియాగో విమానాశ్రయాలు కూడా స్థానం సంపాదించాయి.
ప్రపంచ స్థాయిలో భారత విమానాశ్రయాల నిర్మాణ నైపుణ్యం, సాంస్కృతిక ప్రత్యేకత, పర్యావరణహిత రూపకల్పనకు ఈ గుర్తింపు మరోసారి ముద్ర వేసింది. విమానాశ్రయాలను కేవలం రవాణా కేంద్రాలుగానే కాకుండా, దేశ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే ఆధునిక నిర్మాణాలుగా తీర్చిదిద్దడంలో భారత్ ముందంజలో ఉందని ఈ అంతర్జాతీయ గౌరవం చాటిచెబుతోంది.








