కాగజ్‌నగర్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మద్యం విక్రయాలపై అబ్కారీ శాఖ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక బృందం సోమవారం పట్టణంలోని వెంకటేశ్వర బార్‌పై ఆకస్మిక తనిఖీలు చేపట్టి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ బార్ వెలుపల మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇటీవల పట్టణంలోని బార్లలో లైసెన్స్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా మద్యం విక్రయాలు సాగుతున్నాయంటూ రిపోర్టర్ టీవీ ప్రసారం చేసిన కథనం అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. స్థానిక అబ్కారీ అధికారుల నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు, నేరుగా హైదరాబాద్ నుంచి స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దింపినట్లు తెలిసింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం బార్ ప్రాంగణంలో మాత్రమే మద్యం విక్రయాలు జరపాల్సి ఉండగా, వెంకటేశ్వర బార్ యాజమాన్యం నిబంధనలను ఉల్లంఘించి బయటకు మద్యం విక్రయిస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బార్ యాజమాన్యానికి రూ.20 వేల జరిమానా విధించడంతో పాటు కేసు కూడా నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇతర బార్ నిర్వాహకుల్లో ఆందోళన
హైదరాబాద్ నుంచి వచ్చిన స్టేట్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక తనిఖీలతో కాగజ్‌నగర్‌లోని ఇతర బార్ నిర్వాహకుల్లో ఆందోళన నెలకొంది. స్థానిక స్థాయిలో తనిఖీలు పెద్దగా ఉండవనే ధీమాతో నిబంధనలను ఉల్లంఘిస్తున్న నిర్వాహకులకు ఈ చర్యలు హెచ్చరికగా మారాయి. ఇకపై ఎప్పుడు ఏ బార్‌పై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో పలువురు నిర్వాహకులు అప్రమత్తమవుతున్నట్లు సమాచారం.
అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు ఇలాంటి ప్రత్యేక తనిఖీలు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అధికారులు నిబంధనల అమలుపై కఠినంగా వ్యవహరించనున్న నేపథ్యంలో, మద్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.








