అనంతపురం జిల్లా, గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గాంధీ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు సంస్థ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకోగా, ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి ఎన్. ఈరన్నతో పాటు ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ మండల కార్యదర్శి రామదాసు జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ 1994లో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆవిర్భవించిందని తెలిపారు. మాదిగ దండోరా ఉద్యమం ద్వారా మాదిగల హక్కులు, అభివృద్ధి, సామాజిక న్యాయం కోసం సంస్థ నిరంతరం పోరాటం సాగించిందని పేర్కొన్నారు.
షెడ్యూల్డ్ కులాల ఏబీసీడీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలపాటు నిరంతర ఉద్యమం నిర్వహించి, భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ద్వారా న్యాయబద్ధమైన ఫలితాన్ని సాధించడంలో ఎమ్మార్పీఎస్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. అలాగే సమాజంలో వివక్షకు గురైన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు.
వికలాంగుల పింఛన్ పెంపు, చిన్నారుల గుండెజబ్బుల చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చడం, వృద్ధులు, వితంతువుల పింఛన్ల పెంపు, పేదలకు పంపిణీ చేసే బియ్యం పరిమాణాన్ని నాలుగు కిలోల నుంచి ఐదు కిలోలకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఎమ్మార్పీఎస్ ఉద్యమాలు కీలకంగా నిలిచాయని నాయకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు ఓబులేష్, నాగేంద్ర, ఖాసీం, లక్ష్మీనారాయణ, సుంకన్న, అయ్యప్ప, వీరాంజనేయులు, చంద్ర, మల్లేష్, వన్నూరు తదితరులు పాల్గొని పద్మశ్రీ మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ ఆశయ సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.








