గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో రూ.20 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ మానకొండూరు నియోజకవర్గంలోని గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు.
గన్నేరువరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు సునీల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే లక్ష్యంతో ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని నాయకులు పేర్కొన్నారు.
జంగపల్లిలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో మండలంలోని విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, గ్రామీణ విద్యాభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు వారు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కటకం తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి సంతోష్, చీమలకుంటపల్లి సర్పంచ్ జంగటి ప్రకాష్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మాతంగి అనిల్, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు జెల్ల రాజేశ్వరి, జంగపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు వర్కోలు వెంకట్, గన్నేరువరం గ్రామ శాఖ అధ్యక్షుడు చింతల శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గట్టు నాగరాజ్, నాయకులు అటికం రాజేశం గౌడ్, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.








