కాకినాడ : కాకినాడ నగరంలోని సురేష్‌నగర్–ఎన్‌ఎఫ్‌సీఎల్ రహదారి వెంట చేపట్టిన సెంటర్ డివైడర్ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. డబుల్ లైన్ సీసీ రోడ్లు, డ్రైనేజీ, సెంటర్ డివైడర్ నిర్మాణ పనులు చేపట్టినప్పటికీ డివైడర్ పనులను మధ్యలోనే నిలిపివేయడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతోందని సంఘం పేర్కొంది.
సెంటర్ డివైడర్ నిర్మాణం కోసం అక్కడికి తీసుకొచ్చిన కాంక్రీట్ దిమ్మెలను అనంతరం ఇతర ప్రాంతాలకు తరలించారని ఆరోపించింది. కార్పొరేషన్ నిధులతో చేపట్టిన పనులు పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించడం ప్రజాధన దుర్వినియోగానికి నిదర్శనమని విమర్శించింది.
గత పదేళ్లుగా సీసీ రోడ్లు నిర్మించిన చోట్ల డ్రైనేజీ పనులు పూర్తి చేయకుండానే బిల్లులు డ్రా చేసిన ఘటనలు అనేకం ఉన్నాయని సంఘం ఆరోపించింది. స్మార్ట్ సిటీ సంస్థ పర్యవేక్షణ ప్రారంభమైన తర్వాత కార్పొరేషన్ ఇంజనీరింగ్ పనుల్లో విజిలెన్స్ దర్యాప్తు లేకపోవడం వల్ల అవినీతికి అవకాశం పెరిగిందని పేర్కొంది.
నిధులు సమృద్ధిగా ఉన్న సమయంలో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టి, పూర్తి కాకముందే బిల్లులు చేసుకుని, అనంతరం నిధులు ఉన్న ఇతర మున్సిపాలిటీలకు బదిలీ అవడం 2002 నుంచి కొనసాగుతున్న పరంపరగా మారిందని సంఘం విమర్శించింది. స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన పనులపై బహిరంగ విచారణ జరిపితే కోట్ల రూపాయల అవినీతి, అక్రమ ఆస్తుల వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని పేర్కొంది.
రెండు వంతెనల మధ్య బకింగ్‌హామ్ కాలువ వద్ద అనుమతులు లేకుండా నిర్మించిన పార్కు కారణంగా ఉప్పుటేరు మట్టితో నిండిపోవడంతో ఎన్టీఆర్ వంతెన అప్రోచ్ రోడ్డు కూలిపోయి సుమారు రూ.12 కోట్ల ప్రజాధనం వృథా అయిందని ఆరోపించింది.
గత, ప్రస్తుత ప్రభుత్వాలు కార్పొరేషన్ పనులపై విచారణలు చేపట్టకపోవడం, బాధ్యులపై సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం పెరిగిందని సంఘం అభిప్రాయపడింది. నగర సుందరీకరణ పేరుతో పచ్చని చెట్లకు వైట్ సిమెంట్ పూతలు పూసి వాటిని నాశనం చేస్తున్న పరిస్థితి కూడా ఆందోళనకరమని పేర్కొంది.
2014 నుంచి 2026 వరకు కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం చేపట్టిన అన్ని పనులపై సమగ్ర విచారణ జరిపి అవినీతిని వెలికితీసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.









