contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తెలంగాణ పోలీస్ అకాడమీలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం కేస్ స్టడీ వివరణ

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్న గ్రూప్-1 ద్వారా ఎంపికైన 112 మంది ట్రైనీ డీఎస్పీ అధికారులకు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువెలరీ దోపిడీ కేసుపై ప్రత్యేక కేస్ స్టడీ నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ ఆదేశాల మేరకు జరిగిన ఈ శిక్షణా కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం దర్యాప్తు విధానం, క్షేత్రస్థాయి అనుభవాలు, సాంకేతిక ఆధారాల వినియోగంపై సమగ్రంగా వివరించారు.

సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ శిక్షణలో, అత్యంత ప్రణాళికాబద్ధంగా నేరానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను తెలంగాణ పోలీసులు ఎలా గుర్తించారో, సాంకేతిక పరిజ్ఞానం, డేటా విశ్లేషణ, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సమర్థంగా వినియోగించి కేసును ఎలా ఛేదించారో ట్రైనీ అధికారులకు వివరించారు.

ఈ సందర్భంగా గౌష్ ఆలం మాట్లాడుతూ, నిందితులు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించినప్పటికీ, తెలంగాణ పోలీసుల ఆధునిక దర్యాప్తు సాధనాలు, సమర్థవంతమైన డేటా విశ్లేషణ, బృంద సభ్యుల సమన్వయంతో కేసును విజయవంతంగా పరిష్కరించగలిగామని తెలిపారు. ఈ విజయానికి ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంతో పాటు కమిషనరేట్ పోలీసుల సమష్టి కృషి ప్రధాన కారణమని పేర్కొన్నారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా తెలంగాణ పోలీసుల ప్రత్యేక బృందాలు బీహార్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర (ముంబై), కర్ణాటక (బెంగళూరు) రాష్ట్రాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆయా రాష్ట్రాల పోలీసుల సహకారంతో ముగ్గురు ప్రధాన నిందితులతో పాటు సుబోధ్ సింగ్ సహా మొత్తం ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేసిన విధానాన్ని శిక్షణలో వివరించారు.

సదస్సులో పాల్గొన్న కరీంనగర్ కమిషనరేట్ ఏసీపీలు, దర్యాప్తులో పాల్గొన్న అధికారులు కూడా నిందితులను పట్టుకునే క్రమంలో ఎదురైన సవాళ్లు, అనుసరించిన వ్యూహాలు, క్షేత్రస్థాయి అనుభవాలను ట్రైనీ అధికారులతో పంచుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంత కీలకమైనప్పటికీ, ఫీల్డ్ అనుభవం, సమయస్ఫూర్తి, బృంద సమన్వయం ఉంటేనే క్లిష్టమైన కేసులను ఛేదించడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.

ఇలాంటి కేస్ స్టడీలు భవిష్యత్తులో విధుల్లోకి వెళ్లనున్న ట్రైనీ డీఎస్పీలకు దర్యాప్తు నైపుణ్యాలను పెంపొందించడంలో, క్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడంలో ఎంతో ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్‌స్పెక్టర్లు సృజన్ రెడ్డి, శ్రీనివాస్, రమేష్, తిరుమల్, ప్రకాష్, సరిలాల్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :