పెద్దపల్లి జిల్లా, గోదావరిఖని : గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరశురాం నగర్ సిక్కు వాడలో ఆదివారం సాయంత్రం వన్‌టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నార్కోటిక్ డాగ్ సహాయంతో పోలీసులు విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు.
పాత భవనాల్లో కొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ప్రతి ఇంటిని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాయి. స్థానికుల వివరాలను సేకరించి అనుమానాస్పద అంశాలపై ఆరా తీశాయి.
తనిఖీల్లో భాగంగా మొత్తం 32 మోటార్‌సైకిళ్లు మరియు ఒక టాటా ఏస్ ట్రాలీని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నంబర్ ప్లేట్లు లేని 12 ద్విచక్ర వాహనాలను విచారణ నిమిత్తం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా, అక్రమ రవాణా, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
స్క్రాప్ దొంగతనాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల చోరీలు, అక్రమంగా స్క్రాప్ కొనుగోలు, విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని ఏసీపీ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనిస్తే వెంటనే 100 నంబర్‌కు సమాచారం అందించాలని ఏసీపీ రమేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి, వన్‌టౌన్-2 సీఐ అఫ్జోలోద్దీన్, ఎస్‌ఐలు ప్రసాద్, మనోహర్, అనూష, లక్ష్మణ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.








