contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

జీవో 396 రద్దు చేయాలంటూ దస్తావేజు లేఖర్ల నిరవధిక సమ్మె ప్రారంభం

తిరుపతి జిల్లా, పాకాల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాకాల దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరవధిక పెన్‌డౌన్ సమ్మె ప్రారంభమైంది. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జూలై 20 నుంచి 31వ తేదీ వరకు చేపట్టనున్న ఈ సమ్మెలో దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, డ్రైవర్ల వెల్ఫేర్ సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సమ్మె ప్రారంభానికి ముందు సంఘ ప్రతినిధులు పాకాల మహిళా ఎస్‌ఐ నాగమంజులకు వినతిపత్రం అందజేసి నిరసన కార్యక్రమాలకు అనుమతి తీసుకున్నారు. అనంతరం సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద శాంతియుతంగా పెన్‌డౌన్ సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా సబ్‌ రిజిస్ట్రార్ రహమతుల్లాను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.

సంఘ అధ్యక్షుడు మురళి, ఉపాధ్యక్షుడు అన్సర్, కార్యదర్శి వెంకటముని, సంయుక్త కార్యదర్శి యశ్వంత్, ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 రిజిస్ట్రేషన్ వ్యవస్థను క్రమంగా ప్రైవేటీకరించే ప్రయత్నంలో భాగమేనని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి అప్పగించేందుకు ప్రయత్నించడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది దస్తావేజు లేఖర్లు, వారిపై ఆధారపడిన స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, డ్రైవర్లు తదితర అనుబంధ వృత్తుల కుటుంబాలు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కార్పొరేట్ ప్రయోజనాల కోసమేనా..?

ప్రభుత్వ నిర్ణయం వెనుక కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చే ఉద్దేశమే కనిపిస్తోందని సంఘ నాయకులు విమర్శించారు. రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేట్ కేంద్రాలకు అప్పగించడం వల్ల ప్రజల వ్యక్తిగత ఆస్తి వివరాల భద్రతకు ముప్పు ఏర్పడుతుందని, భవిష్యత్తులో సాంకేతిక, చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఇప్పటికే జూలై 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు బంద్ నిర్వహించి నిరసన తెలిపినా ప్రభుత్వం స్పందించలేదని, అందుకే నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే జీవో 396ను రద్దు చేసి వృత్తి సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సమ్మె కారణంగా సోమవారం పాకాల సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాకాల దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, డ్రైవర్స్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు సతీష్, ధరణి, విజయలక్ష్మి, శ్రీనివాసులు, బాలాజీ, సాహీర్, అంజి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :