న్యూఢిల్లీ : ప్రధాని అధికారిక నివాసం వద్ద మంగళవారం జరిగిన ఉద్రిక్త పరిణామాల అనంతరం, బుధవారం ఇండియా కూటమి ఎంపీలు తమ నిరసనను మరింత ఉధృతం చేశారు. పోలీసుల చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలోని మకర ద్వార్ వద్ద గుమిగూడిన నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన ‘చలో సంసద్’ కార్యక్రమానికి మద్దతుగా మంగళవారం విపక్ష పార్టీలు నిరసనలు చేపట్టాయి. ఈ సందర్భంగా లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇండియా కూటమికి చెందిన పలువురు నేతలు ప్రధాని అధికారిక నివాసం వైపు ర్యాలీగా వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు వారిని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వ్యాన్లు, బస్సుల్లో తరలించారు. ఈ ఘటన దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ అరెస్టులు, పోలీసుల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించిన విపక్ష ఎంపీలు బుధవారం నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌కు చేరుకుని నిరసన తెలిపారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీస్తోందని ఆరోపిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ, “నిన్న ప్రతిపక్ష నేతను సిగ్గులేకుండా అరెస్ట్ చేసి గాయపరిచిన తీరు అత్యంత దారుణం. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందనే భావన కలుగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు శాంతియుత ప్రజాస్వామ్య పోరాటమే మా మార్గం” అని వ్యాఖ్యానించారు.
మరో కాంగ్రెస్ ఎంపీ కె. సురేశ్ మాట్లాడుతూ, “ప్రతిపక్ష నేతతో పాటు ఇతర ఎంపీలపై పోలీసులు ప్రదర్శించిన దౌర్జన్యాన్ని నిరసించేందుకే మేమంతా నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్‌కు వచ్చాం” అని తెలిపారు.
ఇక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ వివాదం కారణంగా ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగుతుండటంతో పార్లమెంట్ కార్యకలాపాలు పదేపదే అంతరాయం కలుగుతున్నాయి. దీంతో కీలక చర్చలు వాయిదా పడుతూ పార్లమెంట్ ప్రతిష్టంభన కొనసాగుతోంది.








