contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

నీట్‌ లీక్‌పై బీఆర్ఎస్‌ నిరసన.. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ : నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌ వ్యవహారం, ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలకు నిరసనగా బీఆర్ఎస్‌ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. బీఆర్ఎస్‌ విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) పిలుపుతో జరిగిన ఈ ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.టి. రామారావు (కేటీఆర్‌) తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని నల్లచొక్కా ధరించి నిరసనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసిన నీట్‌ ప్రశ్నపత్రాల లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

విద్యార్థులు ప్రభుత్వాన్ని కూల్చాలని కాదు, తమకు జరిగిన అన్యాయంపై న్యాయం కోరుతున్నారని కేటీఆర్‌ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో విద్యార్థులు తమ హక్కుల కోసం గళం విప్పడం తప్పు కాదని, వారి స్వరాన్ని అణచివేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు.

యువత శక్తిని ఎవరూ తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరిస్తూ, “ఇది భయపడే జనరేషన్‌ కాదు.. పాలకులను భయపెట్టే జనరేషన్‌” అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. యువతతో ఘర్షణ పడిన ప్రభుత్వాలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాయో కేంద్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. గతంలో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన చరిత్ర తమదేనని, ఇప్పుడు కూడా విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ తాము నిర్వహిస్తున్న నిరసనను అడ్డుకునేందుకు యూత్‌ కాంగ్రెస్‌ను పంపడం ఎందుకని ప్రశ్నించారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్‌ వారి పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.

ధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నీట్‌ లీక్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :