contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం … చలో హైదరాబాద్

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: ఉద్యోగులు, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం గన్నేరువరం మండల వనరుల కేంద్రంలో మహాధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించారు.

తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య, మండల ప్రధాన కార్యదర్శి దామరపల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి కుడిదిల రామయ్య చేతుల మీదుగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని, 2004 నుంచి పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఈ-కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు.

ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు 010 హెడ్ కింద వేతనాలు చెల్లించి వారిని ప్రభుత్వ పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేజీబీవీ, సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల 9 నెలల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించి వారికి ఎంటీఎస్ వర్తింపజేయాలని కోరారు.

మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జీఓ 25ను సవరించి ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, 2008 డీఎస్సీ ద్వారా నియమితులైన కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీరాముల నరేందర్, ఎర్రం మల్లేశం, గుండ కిరణ్, గజ భీమ్కార్ మహేష్, కె. రవీందర్, నరేష్ కుమార్, కంది శ్రీనివాస్ రెడ్డి, సుభాష్ తదితరులతో పాటు ఉపాధ్యాయులు అనిత, ప్రసన్న, స్వరూప, శోభారాణి, సునీత, శ్రీవాణి, స్వప్న, సుజాత, విజయలక్ష్మి, శ్రీదేవి, నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :