contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కరెంటు కోతలపై రైతుల కన్నెర్ర.. సబ్‌స్టేషన్ ముట్టడి

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సక్రమంగా అందడం లేదంటూ గన్నేరువరం మండలానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. గన్నేరువరం, మైలారం, చాకలివానిపల్లె, సాంబయ్యపల్లె గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని 33/11 కేవీఏ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. విద్యుత్ కోతల కారణంగా పంటలకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వ్యవసాయానికి 12 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెబుతున్నప్పటికీ, తమకు కనీసం ఆరు గంటలు కూడా నాణ్యమైన విద్యుత్ అందడం లేదని రైతులు ఆరోపించారు. తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో బోర్లు, మోటార్లు పనిచేయక పంటలకు నీరు అందడం లేదని, దీంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు.

గత ప్రభుత్వ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని గుర్తు చేసిన రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

రైతుల ఆందోళన విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ ఆంజనేయులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం రైతులతో చర్చించారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు విద్యుత్ సమస్యలపై ఏఈకి వినతిపత్రం అందజేశారు.

విద్యుత్ డిమాండ్ పెరగడంతో సరఫరాలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఏఈ ఆంజనేయులు వివరించారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను మెరుగుపరుస్తామని, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు తాత్కాలికంగా ఆందోళన విరమించారు.

‘అబద్ధాల కాంగ్రెస్ పార్టీ’.. రైతు బోయిని బాలయ్య

చాకలివానిపల్లెకు చెందిన రైతు బోయిని బాలయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 24 గంటల విద్యుత్ సరఫరా జరిగేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతులకు అనేక హామీలు ఇచ్చిందని అన్నారు. అయితే ప్రస్తుతం యూరియా, విద్యుత్, సాగునీరు వంటి ప్రతి విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన ఆయన.. విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 24 గంటల కరెంటు అందించకపోతే గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై భారీ స్థాయిలో ధర్నా చేపడతామని హెచ్చరించారు.

రైతులను పట్టించుకోవడం లేదు: సీపీఐ నాయకుడు కాంతాల అంజిరెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా నాయకుడు కాంతాల అంజిరెడ్డి విమర్శించారు. విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు విద్యుత్ కోతలతో తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ధాన్యం కొనుగోళ్ల సమయంలోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ఎరువుల విషయంలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధానాలను ప్రభుత్వం వెంటనే మార్చుకోవాలని డిమాండ్ చేశారు.

మూడు రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళన ఉధృతం

వ్యవసాయానికి కనీసం 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని రైతు విలాసాగరం రామచంద్రం డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా ఎప్పుడు నిలిచిపోతుందో, ఎప్పుడు పునరుద్ధరిస్తారో రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 24 గంటల విద్యుత్ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అధికారులు ఇచ్చిన హామీ మేరకు మూడు రోజుల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించకపోతే గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై ధర్నా చేపట్టి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల రైతులు విలాసాగరం రామచంద్రం, జక్కనపల్లి సత్తయ్య, న్యాత సుధాకర్, సందవేణి ప్రశాంత్,కాంతాల అంజిరెడ్డి, బోయిని అంజయ్య, బోయిని బాలయ్య, జీల అంజయ్య, ఏ. భగవాన్ రెడ్డి, కొట్టే నరసయ్య, రాజు యాదవ్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :