జగిత్యాల : జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉద్ధృతి పెరగడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండలంలోని యామాపూర్ – పకీర్ కొండాపూర్ గ్రామాల మధ్య ఉన్న వాగులో వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో శాశ్వత వంతెన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోగా, గ్రామస్తులు అత్యవసర అవసరాల కోసం కూడా ప్రయాణించలేని పరిస్థితి నెలకొంది.
వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ప్రజలు వాగు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునే వరకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదిలా ఉండగా, శాశ్వత వంతెన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని, అప్పటి వరకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ ప్రత్యామ్నాయ రహదారిని ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.









