కాకినాడ : కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో 1999 జనవరిలో ప్రారంభమైన రైతు బజార్ 28 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ సమగ్ర అభివృద్ధికి నోచుకోలేదని పౌర సంక్షేమ సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. రైతులు, వ్యాపారులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతు బజార్‌ను ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ రైతు బజార్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, దళారీల వ్యవస్థను నిర్మూలించి రైతుల నుంచి నేరుగా ప్రజలకు తక్కువ ధరకే తాజా కూరగాయలు అందించాలనే లక్ష్యంతో రైతు బజార్ ప్రారంభించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరత, ప్రైవేటు వ్యక్తులతో కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాల కారణంగా రైతు బజార్ అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు.
రైతు బజార్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని ఆయన పేర్కొన్నారు. సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులు అందుబాటులో లేక రైతులు, వ్యాపారులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కొంతమంది వ్యాపారులు అనుమతులు లేకుండా అదనపు దుకాణాలు ఏర్పాటు చేసి ఆక్రమణలకు పాల్పడటంతో స్థానిక నివాసితుల ఇళ్ల గేట్లు మూసుకుపోతున్నాయని, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆరోపించారు. ఇప్పటికే అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు.
బర్మా కాలనీ ప్రాంత ప్రజలు ఈ రహదారిని వినియోగించుకోవడం కష్టంగా మారిందని, రైతు బజార్ రహదారిపై సాధారణ ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. అలాగే ఓవర్‌బ్రిడ్జి కింద ఉన్న ఖాళీ ప్రదేశాలను సద్వినియోగం చేసుకునే చర్యలు కూడా తీసుకోవడం లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ అధికారులు ప్రైవేటు న్యాయపరమైన అడ్డంకులను త్వరితగతిన తొలగించి ప్రస్తుతం ఉన్న తాత్కాలిక రేకుల షెడ్ల స్థానంలో అన్ని సౌకర్యాలతో కూడిన శాశ్వత ఆధునిక భవన సముదాయాన్ని నిర్మించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది.
అదే సమయంలో కొత్త నిర్మాణ పనులు చేపట్టే సమయంలో దశాబ్దాలుగా అక్కడే వ్యాపారం చేస్తున్న లైసెన్సుదారుల ఉపాధికి భంగం కలగకుండా సమీపంలో తాత్కాలిక పునరావాసం కల్పించాలని కోరింది.
కేవలం తాత్కాలిక చర్యలతో కాలయాపన చేయకుండా ప్రత్యేక నిధులు కేటాయించి కాకినాడ ఆర్టీసీ రైతు బజార్‌ను రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచే మోడల్ రైతు బజార్‌గా అభివృద్ధి చేయాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా సిటీ, రూరల్ ప్రాంతాలతో పాటు గాంధీనగర్, ఆర్టీసీ కాంప్లెక్స్, తూరంగి డెయిరీ ఫారం ప్రాంతాల్లో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులతో కలిసి వినియోగదారుల సంక్షేమం కోసం రైతు బజార్ వినియోగదారుల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి వినియోగదారుల సమావేశాలు నిర్వహించి సమస్యలు, పరిష్కారాలపై ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తామని పౌర సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు.








