contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు మద్దతిస్తున్న భారత కంపెనీపై అమెరికా ఆంక్షలు

వాషింగ్టన్ : ఇరాన్‌కు చెందిన మహాన్ ఎయిర్ విమానయాన సంస్థకు సహకారం అందిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా కీలక చర్యలు చేపట్టింది. భారత్‌కు చెందిన ఒక సంస్థతో పాటు మొత్తం ఆరు సంస్థలు, వ్యక్తులపై గురువారం ఆంక్షలు విధించినట్లు అమెరికా ట్రెజరీ విభాగం ప్రకటించింది. ఈ సంస్థలు, వ్యక్తులు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కార్యకలాపాలకు పరోక్షంగా మద్దతు అందిస్తున్నాయని ఆరోపించింది.

అమెరికా ట్రెజరీ విభాగం ప్రకారం, ఆంక్షలకు గురైన సంస్థలు మహాన్ ఎయిర్‌కు జనరల్ సేల్స్ ఏజెంట్లుగా (జీఎస్ఏ) వ్యవహరిస్తున్నాయి. మహాన్ ఎయిర్ చాలా కాలంగా ఐఆర్‌జీసీకి సిబ్బంది, ఆయుధాలు, డ్రోన్ వ్యవస్థల రవాణాలో సహకరిస్తోందని వాషింగ్టన్ పేర్కొంది.

ఈ సందర్భంగా అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, “ఐఆర్‌జీసీ లేదా మహాన్ ఎయిర్‌కు ఆర్థిక, లాజిస్టిక్స్ లేదా వాణిజ్య పరంగా సహకరించే వారు ఒక ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లే” అని పేర్కొన్నారు. అలాంటి నెట్‌వర్క్‌లను గుర్తించి, అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి పూర్తిగా వేరు చేసే చర్యలు కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆంక్షల జాబితాలో భారత్‌కు చెందిన స్కైజ్ ట్రావెల్స్ అండ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఉంది. ఈ సంస్థ 2020 నుంచి మహాన్ ఎయిర్‌కు ఏజెంట్‌గా పనిచేస్తోందని, ఢిల్లీ, శ్రీనగర్ నగరాల్లో కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ వెల్లడించింది.

ఇతర ఆంక్షలకు గురైన సంస్థల్లో చైనాకు చెందిన షాంఘై వింగ్స్ ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్, షాంఘై ఎలైట్ ఇంటర్నేషనల్ ట్రావెల్, రష్యాకు చెందిన ఎయిర్ కార్గో ప్రో లిమిటెడ్తో పాటు షాంఘై వింగ్స్ మేనేజింగ్ డైరెక్టర్ టాంగ్ జిన్ కూడా ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఐఆర్‌జీసీకి అనుబంధంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డేడ్‌నెగర్ స్టార్టప్ స్టూడియోపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, పరికరాల లొకేషన్ సమాచారాన్ని సేకరించి, ఇరాన్ సైనిక చర్యలకు ఈ సంస్థ సహకరిస్తోందని అమెరికా ఆరోపించింది.

తాజా ఆంక్షలు అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఇరాన్‌కు మద్దతు ఇస్తున్నట్లు భావిస్తున్న అంతర్జాతీయ సంస్థలపై అమెరికా మరింత కఠిన వైఖరిని అవలంబించే అవకాశం ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :