కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: పద్మశాలి సేవా సంఘం మాజీ అధ్యక్షులు స్వర్గీయ మామిడాల మల్లేశ్వర్ సమాజానికి, సంఘానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పద్మశాలి సేవా సంఘం నాయకులు కొనియాడారు. ఆయన జ్ఞాపకార్థం శుక్రవారం కాగజ్‌నగర్‌లోని ఎల్లగౌడ్ తోట పద్మశాలి కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక స్మారక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మామిడాల మల్లేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకుంటూ పలువురు నాయకులు భావోద్వేగంగా మాట్లాడారు.
పద్మశాలి సేవా సంఘం మార్గదర్శకులు సిందం చంద్రయ్య, మాజీ అధ్యక్షులు రాపెల్లి సదానందం, ప్రస్తుత అధ్యక్షుడు గుల్లపెల్లి నాగేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి వడ్నాల వెంకట నర్సయ్య మాట్లాడుతూ, మామిడాల మల్లేశ్వర్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పద్మశాలి కార్మికుల సంక్షేమం, సంఘ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఆయన సమాజ సేవ, నాయకత్వం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం గౌరవ ముఖ్య సలహాదారులు మామిడాల రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ బోగ వెంకటేశం, కోశాధికారి కొక్కుల మురళి, గాదె వెంకటయ్య, నూతి సుదర్శన్, బుర నర్సింహం, కొప్పుల శంకర్, వలపదాసు రమేష్, కొంపల్లి సుదర్శన్, గడదాసు శంకరయ్య, మాచర్ల శ్రీనివాస్, దండే భీమయ్య, చిలుక లక్ష్మీనారాయణ, బింగి వేణు, సుంక లింగమూర్తి, నులిగొండ సత్యనారాయణ, నులిగొండ అశోక్, వంగరి మొగిలి, ఆడెపు జానకిరాములు, తెలి శ్రీనివాస్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ మామిడాల మల్లేశ్వర్‌కు ఘనంగా నివాళులర్పించారు.








