కాకినాడ: విద్యా సంస్థల్లో విద్యార్థులపై వేధింపులు, అధిక ఫీజుల వసూళ్లు వంటి అంశాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు. చైతన్య విద్యాసంస్థలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి అరవింద్ ఆత్మహత్య ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆయన పేర్కొన్నారు.
విద్యా సంస్థల్లో ఫీజుల భారం పెరుగుతున్నా, సంబంధిత అంశాలపై ప్రభుత్వం తగిన స్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదని రమణరాజు ఆరోపించారు. విద్యార్థులపై ఒత్తిడి, వేధింపులు పెరగడం వల్ల కొందరు తీవ్ర నిర్ణయాలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అరవింద్ ఆత్మహత్య ఘటన అత్యంత విషాదకరమని, ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
విద్యా సంస్థల్లో రహస్య ఫిర్యాదుల వ్యవస్థ
విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించేలా విద్యా సంస్థల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రహస్య ఫిర్యాదుల పోర్టల్ ఏర్పాటు చేయాలని రమణరాజు సూచించారు.
ప్రస్తుతం నోటీసు బోర్డులు ఏర్పాటు చేయడం, ఏటా ప్రకటనలు ఇవ్వడం మాత్రమే కాకుండా.. విద్యార్థులు, తల్లిదండ్రులు తమ పేర్లు బయటకు రాకుండా ఫిర్యాదులు నమోదు చేసే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఫిర్యాదులను స్వతంత్రంగా పరిశీలించి, వేధింపులు లేదా నిబంధనల ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకునే వ్యవస్థ ఉండాలని అన్నారు.
ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్యా సంస్థల వరకు ఫీజుల వసూళ్లు, విద్యార్థులపై ఒత్తిడి వంటి అంశాలపై పటిష్టమైన నియంత్రణ అవసరమని ఆయన పేర్కొన్నారు.
కఠిన చర్యలు లేకపోతే పరిస్థితి మారదు
విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని రమణరాజు డిమాండ్ చేశారు. ఒక ఘటన జరిగినప్పుడు మాత్రమే స్పందించి, కొద్ది రోజుల తర్వాత పరిస్థితిని యథావిధిగా వదిలేస్తే సమస్యలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చట్టపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల హక్కులు, భద్రతను కాపాడేలా దేశవ్యాప్తంగా పటిష్టమైన మార్గదర్శకాలు, పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని దూసర్లపూడి రమణరాజు కోరారు.








