మనోహరాబాద్ (తూప్రాన్), మెదక్ జిల్లా : భర్తను రోకలిబండతో దాడి చేసి హత్య చేసిన కేసులో భార్యకు జిల్లా ప్రధాన న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. నిందితురాలికి రూ.6,000 జరిమానా కూడా విధించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
ఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం.. పార్కిబండ గ్రామానికి చెందిన మురళికి, మనోహరాబాద్‌కు చెందిన విజయలక్ష్మితో సుమారు 22 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా కుటుంబ విషయాలపై భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనోహరాబాద్ పోలీస్ స్టేషన్లో పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించడంతో పాటు, గ్రామ పెద్దల సమక్షంలోనూ పంచాయతీలు నిర్వహించి ఇద్దరికీ నచ్చజెప్పారు.
ఇదిలా ఉండగా, మురళి సుమారు 18 నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరగడంతో అప్పటి నుంచి పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ విషయమై కూడా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో 2021 మార్చి 15న రాత్రి మురళి మంచంపై నిద్రిస్తున్న సమయంలో విజయలక్ష్మి రోకలిబండతో అతనిపై దాడి చేసినట్లు కేసు దర్యాప్తులో తేలింది. తీవ్రంగా గాయపడిన మురళి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2021 మార్చి 16న అప్పటి మనోహరాబాద్ ఎస్ఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
అప్పటి దర్యాప్తు అధికారి, తూప్రాన్ సీఐ స్వామిగౌడ్ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలను సేకరించి న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అనంతరం ప్రస్తుత దర్యాప్తు అధికారి వెంకట రాజాగౌడ్, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ సాక్షులను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి కేసు విచారణను ముందుకు తీసుకెళ్లారు.
కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేష్ బలమైన వాదనలు వినిపించగా, సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ నిందితురాలికి జీవిత ఖైదుతో పాటు రూ.6,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
కేసు విచారణలో కోర్టు లైజన్ అధికారులు ఎస్ఐ విఠల్, కానిస్టేబుల్ రవీందర్ గౌడ్, సీడీఓ మహిపాల్ రెడ్డి సహకరించారు. నిందితురాలికి శిక్ష పడేలా పకడ్బందీగా దర్యాప్తు చేసి, బలమైన సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో సమర్పించిన దర్యాప్తు అధికారులు, కోర్టు లైజన్ అధికారులు, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.








