contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాజేందర్ రెడ్డిది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్యే! : రసమయి సంచలన ఆరోపణలు

గన్నేరువరం, కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం గుండ్లపల్లి మాజీ సర్పంచ్ భర్త బేతేల్లి రాజేందర్ రెడ్డి మృతి వెనుక పలు అనుమానాలు ఉన్నాయని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రసమయి బాలకిషన్ ఆరోపించారు. రాజేందర్ రెడ్డి మృతిని ఆయన  “ముమ్మాటికీ ప్రభుత్వ హత్య” గా అభివర్ణించారు.

శనివారం గుండ్లపల్లిలో రాజేందర్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రసమయి బాలకిషన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన పీఏ మురళీధర్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

తనపై దాడి చేసేందుకు పాత నేరస్తులను రాజేందర్ రెడ్డి వద్దకు పంపించారని, ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ తిరిగి ఆయనపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని రసమయి ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాజేందర్ రెడ్డిని వేధింపులకు గురిచేశారని, ఆ ఒత్తిళ్ల కారణంగానే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఆయన పేర్కొన్నారు.

సీసీ కెమెరా ఫుటేజ్ బయటపెట్టాలి

రాజేందర్ రెడ్డి మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. ఇది నిజంగా ఆత్మహత్యేనా? లేక ఎవరైనా పెట్రోల్ పోసి నిప్పంటించారా? అనే అనుమానాలు ఉన్నాయని, ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలను పోలీసులు పరిశీలించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.

“ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని బయటకు తీసుకురావాలి. బాధ్యులు ఎవరైనా సరే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఆయన అన్నారు.

‘మాకు న్యాయం చేయండి’.. కన్నీరుమున్నీరైన సమత

ఈ సందర్భంగా మృతుడి భార్య బేతేల్లి సమత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేసిన తమ కుటుంబానికే ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్యాయం చేశారని ఆమె ఆరోపించారు.

ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో తన భర్తను పరామర్శించలేదని, మరోవైపు నిందితులకు ఎమ్మెల్యే అండగా నిలుస్తున్నారని ఆమె ఆరోపించారు. ఘటనకు బాధ్యులైన ఐదుగురికి శిక్ష పడే వరకు తాను న్యాయపోరాటం కొనసాగిస్తానని సమత స్పష్టం చేశారు. ఈ పోరాటంలో మీడియా, బీఆర్ఎస్ పార్టీ తనకు అండగా నిలవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

రూ.కోటి పరిహారం, ఉద్యోగం ఇవ్వాలి

బేతేల్లి రాజేందర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.కోటి పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

అదే సమయంలో, వారం రోజుల్లోగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యులపై చర్యలు తీసుకునేలా చూడకపోతే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రసమయి హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, మాజీ జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుడెల్లి ఆంజనేయులు, నాయకులు న్యాత సుధాకర్, గొల్లపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై బాధిత కుటుంబానికి తమ సంఘీభావం తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :