హైదరాబాద్: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరులో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. సదస్సును అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రపంచస్థాయి పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. సదస్సులో వివిధ వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులను సత్కరించేలా కార్యక్రమాలను రూపొందించాలని, అవసరమైన సంస్థాగత ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
గత పెట్టుబడులపై సమగ్ర నివేదిక
గత ఏడాది నిర్వహించిన సదస్సు ద్వారా తెలంగాణకు వచ్చిన పెట్టుబడులు, ఆయా సంస్థల ప్రాజెక్టుల పురోగతి, ఇప్పటివరకు సాధించిన ఫలితాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు. గత అనుభవాలను విశ్లేషించి, ఈసారి మరింత పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
పెట్టుబడిదారులకు తెలంగాణలో ఉన్న అవకాశాలు, మౌలిక వసతులు, పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని సమర్థవంతంగా వివరించేలా సదస్సు నిర్వహణ ఉండాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.
మెట్రో ఫేజ్-2 పనులపై సీఎం సమీక్ష
ఇదే సమావేశంలో హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 పనులపైనా సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించారు. పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ప్రతిపాదించిన 7.5 కిలోమీటర్ల మార్గానికి సంబంధించి రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
మెట్రో పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, రోడ్డు విస్తరణకు సంబంధించిన ప్రణాళికలను ఖరారు చేయాలని చెప్పారు.
ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు కోచ్‌లు
హైదరాబాద్ మెట్రోలో రోజురోజుకూ పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు కోచ్‌లను సమకూర్చుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా భవిష్యత్ అవసరాలను ముందుగానే అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచించారు.
పాతబస్తీ మెట్రో మార్గంలో అనుసరించాల్సిన సాంకేతికతపై ఢిల్లీ మెట్రో అధికారులతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. మెట్రో విస్తరణతో పాటు రోడ్డు అభివృద్ధి, భూసేకరణ, సాంకేతిక అంశాలపై సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులను ఆదేశించారు.








