చిగురుమామిడి, కరీంనగర్ జిల్లా: చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామ శివారులో కరీంనగర్–హుస్నాబాద్ ప్రధాన రహదారిపై ఓ చెట్టు ప్రమాదకరంగా వంగి వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది.
రోడ్డుపైకి వంగిన చెట్టు కొమ్మలో కొంత భాగం ఇప్పటికే విరిగిపోయి ఉండటంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ మార్గంలో నిత్యం పెద్ద సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చెట్టు పరిస్థితిని వాహనదారులు సరిగా గుర్తించలేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు.
చెట్టు కూలితే రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగడంతో పాటు ప్రాణనష్టం జరిగే ప్రమాదం కూడా ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగే వరకు అధికారులు వేచి చూడకుండా తక్షణమే స్పందించి రోడ్డుపైకి వంగిన ప్రమాదకర చెట్టును తొలగించాలని వాహనదారులు, చిన్న ముల్కనూర్ గ్రామస్తులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రహదారి భద్రతను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.








