contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయాలని విద్యార్థుల ఆందోళన

  • ఫీజు రీయింబర్స్‌మెంట్, అధ్యాపకుల కొరత, టీసీ జాప్యంపై నిరసన

 

పాకాల: తిరుపతి జిల్లా పాకాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. సుజాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్‌ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కళాశాల ఎదుట, ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదలై ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ తమకు ఆ నిధులు అందకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. మరో నెల రోజుల్లో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కళాశాలలో కెమిస్ట్రీ, కంప్యూటర్ విభాగాల్లో అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు.

అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయాలని మూడు నెలల క్రితమే ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ) కోసం కళాశాలకు వచ్చే విద్యార్థులను రోజుల తరబడి తిప్పుకుంటున్నారని, కొంతమందిని 15 రోజుల వరకు ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు.

తీవ్రమైన ఎండలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసన చేపట్టినా ప్రిన్సిపాల్ స్పందించకపోవడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని కోరారు.

ప్రిన్సిపాల్‌ను బదిలీ చేయడంతో పాటు కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని విద్యార్థులు స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, డీఈఓను కోరారు. విద్యార్థుల ఆందోళనతో కళాశాల పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :