contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం : ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగుడి మద్దికుంట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షిత రాణి ఇటీవల హత్యకు గురైన ఘటన నేపథ్యంలో గురువారం పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఆమె కుటుంబాన్ని పరామర్శించారు. అక్షిత రాణి స్వగ్రామమైన తురుకల మద్దికుంటలోని ఆమె తల్లిదండ్రులను కలిసి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు అక్షిత రాణి కుటుంబాన్ని పరామర్శించారు.

ముందుగా అక్షిత రాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.4,12,500 ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. అక్షిత రాణి హత్యకు బాధ్యులైన నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మహిళలు, పేదలు, దళితులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి అవుట్‌సోర్సింగ్ ఉద్యోగం కల్పించేలా ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :