కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ : భారత 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు కాగజ్‌నగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) దండే విఠల్ తన నివాస ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జెండాకు వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం సాధించేందుకు ఎందరో సమరయోధులు చేసిన త్యాగాలు, ప్రాణ బలిదానాలు ఎప్పటికీ చిరస్మరణీయమని అన్నారు. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు.
దేశ ఐక్యత, సమగ్రతతో పాటు అభివృద్ధి కోసం ప్రతి పౌరుడు అంకితభావంతో తన వంతు కృషి చేయాలని ఎమ్మెల్సీ పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.
దేశ ప్రగతికి యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు తమ బాధ్యతను గుర్తించి ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు వందనం సమర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా పరిసర ప్రాంతాల్లో దేశభక్తి వాతావరణం నెలకొంది.








