కరీంనగర్ జిల్లా: సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించాలని సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆగస్టు 18న నిర్వహించనున్న జయంతి వేడుకలకు సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా మున్సిపల్ కమిషనర్‌కు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రాలు సమర్పించారు.
గత ఐదేళ్లుగా ప్రభుత్వం అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కూడా జయంతి వేడుకలను మరింత ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.
సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడిన యోధుడిగా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నాయకులు పేర్కొన్నారు. ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసేలా జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించడం అవసరమని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడంతో పాటు, అధికారికంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కోరారు. పాపన్న గౌడ్ చరిత్ర, ఆయన పోరాట స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోడూరి పరుశురామ్ గౌడ్, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కలర్ సత్తన్న గౌడ్, జిల్లా అధ్యక్షులు బుర్ర పరశురామ్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మాటి రాజమల్లు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.








