కాకినాడ: లోకకళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వయంభు భోగి గణపతి పీఠం 19వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా శ్రావణ మాస తొలి ఆదివారం రాత్రి 21వ త్రినాథ వ్రత మేళాను పీఠంలో వైభవంగా నిర్వహించారు. మాఘమాసం నుంచి ప్రతి ఆదివారం భక్తుల గృహాల్లో కొనసాగుతున్న ఆధ్యాత్మిక పరంపరలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.
శ్రీవారి సేవా సమితి, హరహర మహాదేవ భజన సమాఖ్య ప్రతినిధుల పర్యవేక్షణలో త్రినాథ వ్రత వేదికను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకులు రమణరాజు–వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో వేదికపై 63 కలశాలను ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
ముందుగా పసుపు గణపతి, లక్ష్మీకలశ పూజలు నిర్వహించిన అనంతరం దత్తాత్రేయ స్వామివారికి వేదమంత్రాల నడుమ పంచామృత అభిషేకం చేశారు. అనంతరం భక్తులతో సహస్రనామ పారాయణం నిర్వహించి, భక్తిశ్రద్ధలతో త్రినాథ వ్రత కథను శ్రవణం చేయించారు.
హరహర మహాదేవ భజన సమాఖ్య సభ్యుల భజన సంకీర్తనలతో పీఠం పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్యక్రమం ముగింపులో శంఖానాదాల మధ్య స్వామివారికి మంగళహారతి ఇచ్చి భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
త్రినాథ వ్రత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇప్పటికే కోనసీమ, కాకినాడ జిల్లాల పరిధిలోని పలు గ్రామాల్లో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులు, అనారోగ్యం, అశాంతి వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి ఇళ్లకు స్వయంగా వెళ్లి వ్రతాలను నిర్వహిస్తున్నామని చెప్పారు.
యువత, చిన్నారులను కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ సామూహిక వ్రతాలను విజయవంతంగా నిర్వహించినట్లు వివరించారు.
వ్రత వేదిక కార్యదర్శి గోవింద స్వామి మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో కన్యలు, వృద్ధులు, ఒంటరి మహిళలు, దంపతులతో సామూహిక త్రినాథ వ్రతాలను మరిన్ని ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ వ్రతాల నిర్వహణకు భక్తుల నుంచి ఎలాంటి ఖర్చులు, రుసుములు, చందాలు లేదా కానుకలు తీసుకోవడం లేదని, భోగి గణపతి పీఠమే ఉచితంగా అన్ని ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. చలిమిడి, వడపప్పు, తమలపాకులు, నూనె, వత్తులు వంటి సాధారణ పూజా సామగ్రితో ప్రతి కుటుంబం కూడా త్రినాథ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్య, సతీష్, నాగమణి, ప్రభాకరరావు, సరోజ, నాగరాజు, కుమారి సత్యవతి, పద్మావతి, వెంకటలక్ష్మి, మల్లిక, నిహాల్, సంతోష్, వరలక్ష్మి, వెంకటేశ్వరి, మహాలక్ష్మి, కళావతి, పార్వతి, జయలక్ష్మి, అనంతలక్ష్మి, యామిని, తన్విక, గంగా, భవాని, విజయలక్ష్మి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.








