contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గ్రామీణంలో నగర గణేశ ఉత్సవ సమితి సమీక్ష

కాకినాడ: కాకినాడ నగర గణేశ ఉత్సవ సమితి 38వ వార్షిక సమావేశం ఆదివారం సాయంత్రం బై వే రెసిడెన్స్ మీటింగ్ హాల్‌లో జరిగింది. సమితి రూరల్ ఇన్‌చార్జ్ రంభాల వెంకటేశ్వరరావు అధ్యక్షతన గ్రామీణ ప్రాంతాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమితి అధ్యక్షుడు దూసర్లపూడి రమణ రాజు ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తొలుత విఘ్నేశ్వర పూజ నిర్వహించిన అనంతరం లోకమాన్య బాలగంగాధర్ తిలక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రమణ రాజు మాట్లాడుతూ.. గణేశ్ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి సమితి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నెల 18న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో గణపతి నవరాత్రి ఉత్సవాల తేదీలు, నిమజ్జన ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, భద్రత తదితర అంశాలపై చర్చ జరగనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి 22 వరకు గణపతి నవరాత్రులు, 23, 24 తేదీల్లో నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై అధికారులు, ఉత్సవ కమిటీలతో సమన్వయం చేయనున్నట్లు తెలిపారు.

జిల్లా ఆహ్వాన కమిటీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా రంభాల వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఈ ఏడాది కాకినాడ సిటీ, రూరల్‌తో పాటు తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లోని నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాల్లో గణేశ్ ఉత్సవాల నిర్వాహకులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

రూరల్ ఇన్‌చార్జ్ రంభాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలుగా రూరల్ వాకలపూడి తీరంలో పెద్ద ఎత్తున గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి సమితి జిల్లా కమిటీని మరింత పటిష్టంగా నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాకినాడ రూరల్, సిటీ ఎమ్మెల్యేలు పంతం నానాజీ, వనమాడి కొండబాబు సూచనలు తీసుకుని, తుని, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల ఎమ్మెల్యేల సహకారంతో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లలో ప్రభుత్వానికి, ఉత్సవ కమిటీలకు మధ్య సమన్వయ వారధిగా పనిచేస్తామని తెలిపారు.

అన్నవరం పంపా తీరం నుంచి సామర్లకోట కెనాల్ వరకు ఉన్న ప్రతి నిమజ్జన రేవు వద్ద అవసరమైన ప్రభుత్వ ఏర్పాట్లకు సమితి తరఫున సహకరిస్తామని పేర్కొన్నారు.

రూరల్ ఆహ్వాన కమిటీలో ప్రతి గ్రామం నుంచి సభ్యత్వం ఉండేలా చర్యలు తీసుకుంటామని రంభాల తెలిపారు. ఆయా గ్రామాల్లో గణేశ్ చవితి ఉత్సవాలను నిర్వహించే కమిటీల ప్రతినిధులను ఆహ్వానించి సమన్వయంతో ముందుకు సాగుతామని చెప్పారు.

సమావేశంలో బొలిశెట్టి వెంకట రామకృష్ణ, పెండెం సత్యనారాయణ, నాగిరెడ్డి సతీష్, కవికొండల భీమశంకర్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, చలపతిరావు, శివకుమార్, వాసు, పితాని లీలావతి, పారుపల్లి లక్ష్మణరావు, భువనేశ్వరి, పద్మావతి, రమేష్, సేతు మాధవరావు, సూరిబాబు, సత్యనారాయణ, రమణ, రాఘవులు, వెంకట్, రవి తేజ, నారాయణ, సత్యమూర్తి, స్వామి, జయనారాయణ, గణేష్, సత్తిబాబు, కోలా ఎల్లారావు, చిరుకూరి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :