కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, బెజ్జూర్: బెజ్జూర్ మండలంలో అక్రమంగా తరలిస్తున్న ప్రభుత్వ రాయితీ (PDS) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. శనివారం తెల్లవారుజామున విశ్వసనీయ సమాచారం మేరకు బెజ్జూర్ ఎస్సై సర్తాజ్ పాషా ఆధ్వర్యంలో పోలీసులు మొగవెల్లి–సోమని గ్రామాల మధ్య వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో రెండు వాహనాల్లో తరలిస్తున్న మొత్తం 12 క్వింటాళ్ల PDS బియ్యం పట్టుబడింది. మంచిర్యాలకు చెందిన తూర్పాటి దుర్గయ్యకు చెందిన బొలెరో ట్రాలీ ఆటో (TG 19 T 3298)లో 4 క్వింటాళ్ల బియ్యం గుర్తించారు. అలాగే బెజ్జూర్ మండలం పాపన్నపేటకు చెందిన కామెరా కోటేష్ ఆటో (AP 01 Y 4713)లో మరో 8 క్వింటాళ్ల PDS బియ్యం లభించింది.
పట్టుబడిన బియ్యంతో పాటు రెండు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రభుత్వ రాయితీ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.








