contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అంతర్‌ జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠా అరెస్ట్

చంద్రగిరి, తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా చంద్రగిరి పోలీసులు ప్రత్యేక నిఘా, సాంకేతిక ఆధారాలతో అంతర్‌జిల్లా ద్విచక్ర వాహనాల దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన 18 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా వాహనాల చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనాల చోరీలను అరికట్టేందుకు చంద్రగిరి పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన వాహన చోరీ కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించారు.

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో నారావారిపల్లి–భీమవరం రోడ్డులోని శేషాపురం శివాలయం సమీపంలో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో పఠాన్ అఫ్రోజ్ (21), ఎణిమేటి లోచన్ నివాస్ (19), కృష్ణప్ప ఆచారి సాయి కృష్ణ (18), మదారపు వంశీకృష్ణ (19), నీరుకొండ జితేంద్ర బెనర్జీ (20), పందల సతీష్ బాబు (28) ఉన్నారు.

నిందితులను విచారించగా, వారి సమాచారం మేరకు అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో శ్రీనివాసమంగాపురం సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో దాచిపెట్టిన వాహనాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

పలు జిల్లాల్లో చోరీలు

దర్యాప్తులో చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో 7 కేసులు, ఎస్వీయూ క్యాంపస్‌లో 3, తిరుపతి రూరల్‌లో 2, తిరుచానూరులో 1, శ్రీకాళహస్తి-1 టౌన్‌లో 2, నెల్లూరు రూరల్‌లో 2, వేదాయపాళెంలో 1, మనుబోలులో 1 కేసులకు సంబంధించి చోరీకి గురైన వాహనాలను పోలీసులు గుర్తించారు. మొత్తం 18 ద్విచక్ర వాహనాలతో పాటు ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.

సాంకేతిక ఆధారాలు, వివిధ పోలీస్ విభాగాల సమన్వయంతో సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించిన చంద్రగిరి SDPO బి. ప్రసాద్, CI ఎం. సురేష్ కుమార్, SI బి. రవి ప్రకాష్ రెడ్డి, SI ఈ. అరుణాచలం, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

జిల్లాలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులు, ముఠాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ వాహనాలను భద్రంగా ఉంచుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :