contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

కార్పొరేట్ల నుంచి మా భూములను కాపాడండి .. గిరిజనుల ఆవేదన

అనంతగిరి, అల్లూరి సీతారామరాజు జిల్లా : తమను ఏజెన్సీ గిరిజనులుగా గుర్తించి రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొండశిఖర గ్రామాల గిరిజనులు భారీ పాదయాత్ర నిర్వహించారు. జాతీయ జెండాలు చేతబూని, సుమారు 5 కిలోమీటర్ల మేర సాగిన ఈ పాదయాత్రలో బూరిగ, చిన్నకోనెల, బొంగిజ, రాయపాడు, సిమిడివలస తదితర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయతీ పరిధిలోని చిన్నకోనెల గ్రామం నుంచి ప్రారంభమైన పాదయాత్ర బూరిగ, సిమిడివలస, రాయపాడు, బొంగిజ గ్రామాల మీదుగా కొనసాగింది. కొండశిఖర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు ఏజెన్సీ ప్రాంత హక్కులు కల్పించాలని, తమ భూములను కార్పొరేట్ సంస్థలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి రక్షించాలని వారు డిమాండ్ చేశారు.

అనంతగిరి మండలంలోని రొంపిల్లి, ఎన్‌ఆర్‌పురం, భీంపోలు, గరుగుబెల్లి, గుమ్మకోట పంచాయతీల పరిధిలో సుమారు 60 రెవెన్యూ గ్రామాల్లో 20 వేల మంది ఆదివాసీ గిరిజనులు జీవనం సాగిస్తున్నారని పాదయాత్ర నిర్వాహకులు తెలిపారు. తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటూ వస్తున్న భూములపై తమకు సరైన హక్కులు కల్పించాలని కోరారు.

తమకు సమాచారం ఇవ్వకుండా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసి, కొన్ని భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారుల పేర్లపై నమోదు చేశారని వారు ఆరోపించారు. రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ROR) చట్టానికి విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కొండశిఖర గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఆర్‌పురం పంచాయతీ పరిధిలోని బొడ్డవలస నుంచి రాయపాడు, చిముడివలస, బొంగిజ, బూరిగ, చిన్నకోనెల గ్రామాలకు వెళ్లే మార్గాల్లో రోడ్డు సౌకర్యాలు పూర్తిస్థాయిలో లేవని తెలిపారు.

2022లో గ్రావెల్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ పనులు సక్రమంగా జరగలేదని, కల్వర్టుల నిర్మాణం కూడా సరిగా చేపట్టలేదని ఆరోపించారు. రాత్రివేళల్లో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ గ్రామాలకు చేరుకోవడం కూడా కష్టంగా మారుతోందని తెలిపారు.

2025లో బీటీ రోడ్డు నిర్మాణానికి సుమారు రూ.6 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాలేదని, తక్షణమే రహదారి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

లేట్ డెత్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ సర్టిఫికెట్లు జారీ చేయడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ స్వయంగా గ్రామానికి వచ్చి సర్టిఫికెట్లు జారీ చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.

కొండశిఖర గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి తీసుకురావాలని, తమకు ఏజెన్సీ గిరిజనుల హక్కులు కల్పించాలని పాదయాత్రలో పాల్గొన్న వారు డిమాండ్ చేశారు. భూములకు రక్షణ, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో సోమల అప్పలరాజు, కోనపర్తి సింహాచలం, కోటపర్తి మహేష్, రేగం లచ్చమ్మ, పొట్టంగి గంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :